Wednesday, 8 May 2019

దాన వీర శూర కర్ణ - కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం

    రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..

    పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.

    రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ..
    నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును తెలియని అజ్ఞానిని కాదు..

    మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .

    ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే గౌరవించితిని.

    ఊం..
    రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక , ఆపైన మా అభిమతము గ్రహింపక ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.

    ఇప్పుడు నేను సంధికొడంబడినచో హహ్హ.. హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా ? లేక, నీవు వంధిగా వర్ణించిన వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?

    దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి

    హ..హహ.. ఐదూల్లైనా ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి
    కృష్ణా ! నీ కోరిన కోర్కె సరియే ఐనచో, నిజమే ఐనచో నేనీయుటకీ సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !

    ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి, నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..

    ఇది గాక ...
    మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?

    పాండురాజా ? యమధర్మరాజా ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగమొందుటకు హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?

    ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..

    మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?

    అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో హ..హహ.. ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.

    అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా ?

    భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?

    ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా? కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా తొలగునన్న సత్యము నీవెరుగవా?

    అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని, మతిమాలి కాదు.

    అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..
    మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?

    ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !

    కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే నా తుది నిర్ణయము .

No comments:

Post a Comment